Virat Kohli: విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-30 15:27:29  IST  )

రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ (Delhi), రైల్వేస్ (Railways) మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Virat Kohli: విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ (Delhi), రైల్వేస్ (Railways) మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దాదాపు 12 ఏళ్ల తరువాత భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. అయితే కోహ్లీని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే తొలి రోజు ఆట కొనసాగుతోండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి అతని కాళ్లు మొక్కాడు. ఈ ఊహించని ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని బయటకు లాక్కెళ్లారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించగా వారు తమదైన శైలిలో ఆ అభిమానికి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో కూడా కోహ్లీని వదిలిపెట్టరా.. మీ అభిమానం తగలెయ్యా.. అంటూ సెటైర్ల వేస్తున్నారు.

ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో ఘోర పరాజయం తరువాత టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ (BCCI) ఆల్టిమేటం జారీ చేయడంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కోహ్లీ ఆడుతోన్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారు జామున 3 గంటలకే స్టేడియం బయట క్యూ కట్టారు. దీంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) ప్రేక్షకులతో నిండిపోయింది. విరాట్ కోహ్లీ (Virat Kohli), ఆర్సీబీ (RCB) నినాదాలతో స్టేడియం మారుమోగుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 27 ఓవరల్లో 5 వికెట్లకు 87 పరుగులు చేసింది.

Next Story