కీర దోసకాయల్ని రంగునీళ్లలో ముంచుతున్న మహిళ.. వీడియో వైరల్

by Naga Rani Yarlagadda |

కటిహార్ రైల్వేస్టేషన్లో అందరూ చూస్తుండగానే కీర దోసకాయల్ని ఓ మహిళ రంగునీటిలో ముంచి తీస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కీర దోసకాయల్ని రంగునీళ్లలో ముంచుతున్న మహిళ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లోని కటిహార్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దోసకాయలు తాజాగా కనిపించేందుకు ఒక మహిళ వాటికి రంగు వేస్తున్న దృశ్యాలు నెటిజన్లను కలవరపెడుతున్నాయి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక మహిళ తన ముందున్న నీటి బకెట్లలో దోసకాయల్ని ముంచగానే అవి పచ్చగా మారుతున్నాయి. ఆమె పక్కనే ఉన్న మరో మహిళ దోసకాయలను నీటిలో కడిగి ఇస్తుంటే, మొదటి మహిళ వాటిని ఆ రంగు ద్రావణంలో ముంచుతోంది. ఆ రంగు పూయకముందు, పూసిన తర్వాత దోసకాయల రంగులో వస్తున్న మార్పు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఆమె ఉపయోగిస్తున్న ఆ లిక్విడ్ ఏంటన్నది తెలీదు. అది కెమికలా లేక ఫుడ్ కలరా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

ఆ లిక్విడ్ హానికరమైనదని గ్యారెంటీ ఏంటి?

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. "ఇది ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే.. పేదవాళ్ళని జాలి చూపిస్తే ఇలాంటి అక్రమాలు ఆగవు, కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఒక వినియోగదారుడు కామెంట్ చేయగా.. "తమ వ్యాపారం కోసం ఇతరుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు" అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. కొందరు మాత్రం అది హానికరమైన రంగు అని ఎలా చెబుతారని, పూర్తి నిజా నిజాలు తెలియకుండా స్పందించకూడదని వాదిస్తున్నారు.

అధికారుల స్పందన కోసం ఎదురుచూపు

రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి ఆహార కల్తీలు జరుగుతుండటంపై ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై రైల్వే అధికారులు గానీ, ఆహార భద్రతా విభాగం అధికారులు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ వీడియో యొక్క ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది. ఏది ఏమైనా, బయట దొరికే కూరగాయలు, పండ్లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కటిహార్ రైల్వే స్టేషన్ చల్లటి కీర, తియ్యటి కర్భూజా, ఎర్రటి పుచ్చకాయ ముక్కలకు ఫేమస్ అని ఒక నెటిజన్ అదే వీడియో కింద కామెంట్ చేయడం గమనార్హం.

Next Story