- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: ‘క్లాడ్ ఏఐ’ మాయాజాలం.. పూర్వీకుల భూమిని కనిపెట్టిన యువకుడు
ఏఐ సాయంతో ఓ వ్యక్తి తన పూర్వీకుల నాటి భూమిని పక్కాగా కనిపెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జస్ట్ కోడింగ్, స్టోరీలు రాయడానికే కాదండోయ్.. నిత్యజీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్యలను కూడా చిటికెలో పరిష్కరిస్తుందని ఓ వ్యక్తి నిరూపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని తన పూర్వీకుల నాటి ఆస్తిని కనిపెట్టేందుకు ఓ యువకుడు ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జహీద్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని మహ్మద్‌పూర్ అనే గ్రామంలో వారి ముత్తాతలు, తాతల కాలం నాటి భూమి ఉంది. అయితే జహీద్ తన జీవితంలో ఆ గ్రామానికి వెళ్లింది కేవలం కొన్నిసార్లు మాత్రమే కావడంతో ఆ ఆస్తి ఎక్కడుందో వెతకడం అతనికి సాధ్యం కాలేదు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భూ రికార్డులను డిజిటలైజ్ చేసినప్పటికీ, అవి వేర్వేరు వెబ్‌సైట్లలో క్లిష్టమైన అధికారిక హిందీ భాషలో ఉండటంతో వాటిని చదవడం సవాలుగా మారింది.
రంగంలోకి క్లాడ్ ఏఐని దింపి..
అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి జహీద్ ఆంత్రోపిక్ సంస్థకు చెందిన ‘క్లాడ్ ఏఐ’ (Claude AI) సాయం తీసుకున్నాడు. క్లాడ్ లోని ‘కంప్యూటర్ యూజ్’ అనే సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించి ఒక అద్భుతం చేశాడు. ఆ ఏఐ అసిస్టెంట్ స్వయంగా ప్రభుత్వ వెబ్‌సైట్లను ఓపెన్ చేసి, స్క్రీన్ పై ఉన్న కీబోర్డ్ ద్వారా జహీద్ దివంగత తండ్రి పేరును హిందీలో టైప్ చేసింది. అలా వారి కుటుంబానికి సంబంధించిన అన్ని ప్లాట్ల వివరాలను వెతికి పట్టుకుని, వాటి ప్లాట్ నెంబర్లు సేకరించింది.
గూగుల్ మ్యాప్స్‌తో లింక్..
క్లాడ్ ఏఐ అంతటితో ఆగకుండా, ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో మ్యాప్‌లో చూపించడానికి వినూత్న ప్రయత్నం చేసింది. ప్రభుత్వ మ్యాపింగ్ పోర్టల్‌లో ఉన్న క్లిష్టమైన యూటీఎమ్ (UTM) కోఆర్డినేట్లను సాధారణ లొకేషన్ పాయింట్లుగా మార్చింది. ఆపై మొత్తం 25 ప్లాట్లకు సంబంధించిన సరిహద్దు రేఖలతో (Polygons) కూడిన ఓ కేఎమ్ఎల్ (KML) ఫైల్‌ను క్రియేట్ చేసి ఇచ్చింది. ఆ ఫైల్‌ను జహీద్ గూగుల్ మై మ్యాప్స్ (Google My Maps)లో అప్‌లోడ్ చేయగా.. వారి పూర్వీకుల భూమికి సంబంధించిన స్పష్టమైన దారి, సరిహద్దులు ఫోన్‌లోనే ప్రత్యక్షమయ్యాయి. దీంతో జహీద్ నేరుగా తన కారు డ్రైవ్ చేసుకుంటూ తాతల నాటి స్థలాన్ని సులువుగా చూసుకోగలిగాడు. ప్రస్తుతం అతడు లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






