VIRAL: HDFC బ్యాంక్ ఉద్యోగి వీరంగం.. కస్టమర్‌పై కుల వివక్ష వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-09 07:34:31  IST  )

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వాప్తంగా కుల పిచ్చి రోజురోజుకూ ముదురుతోంది.

VIRAL: HDFC బ్యాంక్ ఉద్యోగి వీరంగం.. కస్టమర్‌పై కుల వివక్ష వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వాప్తంగా కుల పిచ్చి రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా, ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని కాన్పూర్‌ (Kanpur)లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్‌లో ఓ మహిళా ఉద్యోగి కస్టమర్‌పై బూతు పురాణం విప్పింది. అంతటితో ఆగకుండా కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు ఉద్యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు జరిగింది ఇదే..

వివరాల్లోకి వెళితే.. వీడియో ప్రకారం ఆస్తా (Aastha) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగి ఒక ఖాతాదారుడితో (Customer) తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఏదో ఫిర్యాదు విషయంలో మొదలైన గొడవ ముదిరి అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించే వరకు వెళ్లింది. సదరు ఉద్యోగి గట్టిగా అరుస్తూ.. ‘నేను ఠాకూర్‌ని, నాతో పెట్టుకోవద్దు’ అంటూ తన కులాన్ని ప్రస్తావిస్తూ కస్టమర్‌ను బెదిరించింది. ఆ వెంటనే తన డెస్క్‌పై ఉన్న లాప్‌టాప్‌ను ఎత్తి కస్టమర్‌పైకి విసరబోయింది. ‘నిన్ను నాశనం చేస్తా’ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. దీంతో అక్కడ ఉన్న ఇతర బ్యాంక్ సిబ్బంది ఆమెను అడ్డుకోవడానికి, శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె ఏమాత్రం తగ్గకుండా అరుస్తూనే ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో బ్యాంకింగ్ రంగంలో ఉండాల్సిన కనీస మర్యాద కూడా లేదంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి ఇలా కులం పేరుతో దూషించడం, భౌతిక దాడికి దిగడం క్షమించరాని నేరమని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై ఆ ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.

Next Story