VIRAL: భగవంతుడా.. హతవిధీ..! ఆఖరి మజిలీ చెత్త రిక్షాలో..

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-27 04:10:55  IST  )

ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఏమాత్రం మార్పు రావడం లేదు.

VIRAL: భగవంతుడా.. హతవిధీ..! ఆఖరి మజిలీ చెత్త రిక్షాలో..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఏమాత్రం మార్పు రావడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖకు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని లెక్చర్లు దంచుతున్న అధికార పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District)లోని గుమ్మలక్ష్మీపురం (Gummalakshmipuram) గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కరిగిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు రాధమ్మ (Radhamma) తీవ్ర అస్వస్థతకు గురైనందున కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం భద్రగిరి (Bhadragiri) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం రాధమ్మ మృతదేహాన్ని సొంత గ్రామం గుమ్మలక్ష్మీపురానికి తరలించాల్సి ఉండగా.. ఆసుపత్రి వద్ద అంబులెన్స్ (Ambulance) సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనం అద్దెకు తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో చివరికి చెత్త తరలించే రిక్షాలో రాధమ్మ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025 సంవత్సరంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను తరలించడానికి కనీస అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం ఎంత విడ్డూరమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, రాధమ్మ మృతదేహాన్ని చెత్త రిక్షాలో తరలిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story