VIRAL: చేతికి వచ్చిన ఉద్యోగం హాంఫట్.. సోషల్ మీడియాలో టెక్కీ ఆవేదన వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-21 05:49:48  IST  )

డెలాయిట్ సంస్థలో ఉద్యోగం వచ్చిందని పాత కంపెనీకి రాజీనామా చేసిన టెక్కీకి ఊహించని షాక్ తగిలింది.

VIRAL: చేతికి వచ్చిన ఉద్యోగం హాంఫట్.. సోషల్ మీడియాలో టెక్కీ ఆవేదన వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం దొరికితే.. మంచి ప్యాకేజీ కోసం మరో కంపెనీకి మారడం టెక్కీలకు అలవాటే. అయితే, అలా చేయబోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. రాజీవ్ అంజనా అనే టెక్కీ ఇటీవల ప్రముఖ కన్సల్టింగ్ దిగ్గజం 'డెలాయిట్' (Deloitte)లో ఇంటర్వ్యూకి హాజరై అన్ని రౌండ్లను విజయవంతంగా పూర్తి చేశాడు. ప్యాకేజీ తదితర వివరాలతో హెచ్ఆర్ నుంచి ఆఫర్ లెటర్ కూడా అందింది. దీంతో రాజీవ్ తన పాత కంపెనీకి రాజీనామా చేయగా.. చివరి నిమిషంలో డెలాయిట్ సంస్థ షాకిచ్చింది.

అనూహ్యంగా ఆఫర్ లెటర్ రద్దు..

తన పాత కంపెనీలో నోటీస్ పీరియడ్ పూర్తి కావస్తుండగా.. రాజీవ్ అంజనాకు డెలాయిట్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నుంచి ఓ ఈమెయిల్ వచ్చింది. ‘డిస్క్రిపెన్సీ రివ్యూ’ (Discrepancy Review) పూర్తయిందని, తాము ‘నీతో ముందుకు వెళ్లడం లేదు’ అని ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు. ఆఫర్ ఎందుకు రద్దు చేశారో తెలుసుకునేందుకు రాజీవ్ హెచ్ఆర్‌ను సంప్రదించగా, అది ‘అత్యంత రహస్యం’ (Confidential) అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, అతడిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు, భవిష్యత్తులో డెలాయిట్‌కు దరఖాస్తు చేయవద్దని హెచ్చరించినట్లు సమాచారం.

దీంతో రాజీవ్ తనకు జరిగిన అన్యాయాన్ని, ఆవేదనను ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నాడు. ‘ప్రపంచంలోని అతిపెద్ద బిగ్ 4 సంస్థల్లో ఒకటైన డెలాయిట్‌లో ఉద్యోగం వచ్చిందని సంతోషించే లోపే ఇలా జరగడం చాలా బాధాకరం. కారణం తెలిస్తే కనీసం దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉండేది’ అని అతను పేర్కొన్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల బాధ్యతారాహిత్యంపై మండిపడుతున్నారు. ఒక వ్యక్తి తన కెరీర్‌ను రిస్క్ చేసి రాజీనామా చేశాక, ఇలా ఆఫర్ రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

Next Story