VIRAL: రూ.50 ఇవ్వకుంటే పౌరసత్వం రద్దు! ఓటర్ల నుంచి బీఎల్‌వో లంచం డిమాండ్ (వీడియో)

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-10 03:20:18  IST  )

ఓటరు గుర్తింపు పత్రాల వెరిఫికేషన్ కోసం రూ.50 ఇవ్వకుంటే పౌరసత్వం పోతుందంటూ అంటూ ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) బెదిరింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

VIRAL: రూ.50 ఇవ్వకుంటే పౌరసత్వం రద్దు! ఓటర్ల నుంచి బీఎల్‌వో లంచం డిమాండ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఓటర్లు అంతా తమకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలను నింపి బీఎల్‌వోలకు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే దారుణాలు సైతం వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓటర్ల నుంచి డబ్బులు ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) బాగోతం జార్ఖండ్‌లో గర్వా జిల్లా సింధూరియా గ్రామంలో బయటపడింది.

క్యాష్ కొట్టకుంటే.. పౌరసత్వం ఊస్ట్!

సింధూరియా గ్రామ పరిధిలోని బూత్ నంబర్ 289కి చెందిన బీఎల్‌వో జమీలా బీబీ (Jamila Bibi), ఆమె భర్త మహ్మద్ పర్వేజ్ అన్సారీ (Mohammad Parvez Ansari)లు కలిసి ఎన్యుమరేషన్ ఫారాల వెరిఫికేషన్ కోసం ఒక్కో ఓటరు నుంచి రూ.50 డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉచితంగా చేసే ఈ పనికి డబ్బులెందుకని గ్రామస్తులు ప్రశ్నించగా.. ‘డబ్బులు ఇవ్వకపోతే మీ ఓటరు దరఖాస్తులు ఉన్నతాధికారులకు పంపం.. మీ పౌరసత్వం రద్దయిపోతుంది.. మిమ్మల్ని ఇక్కడి నుంచి గెంటేస్టారు’ అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో భయపడిన కొంతమంది నిరక్షరాస్యులు తమ వద్ద ఉన్న అరకొర డబ్బులు వారికి సమర్పించారు. మరికొందరు ఈ తతంగాన్ని గమనించి, లంచం డిమాండ్ చేస్తున్న దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే..

వైరల్ అవుతున్న వీడియోలో బీఎల్‌వో భర్త మహ్మద్ పర్వేజ్ అన్సారీ స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వడం లేదు, కాబట్టి ఫారాలు పూర్తి చేసినందుకు గాను ఒక్కొక్కరు రూ.50 ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వని వారి ఫారాలను మేము ఆఫీసులో సబ్మిట్ చేయం. ఆ తర్వాత మీ పౌరసత్వం పోయినా మాకు సంబంధం లేదు’ అని బెదిరించడం స్పష్టంగా రికార్డ్ అయింది. అయితే, ఈ వీడియో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ పూర్తిగా ఉచితమని, ఇలాంటి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాధ్యురాలైన బీఎల్‌వో జమీలా బీబీపై విచారణ జరిపి సస్పెండ్ చేసేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు.

Next Story