స్కూల్‌లో టవల్‌ డ్యాన్స్‌ వైరల్‌.. మానవ హక్కుల కమిషన్ సీరియస్

by Ramesh Naini |

పసిపిల్లల ముందు యువతులు టవల్స్ కట్టుకుని చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్కూల్‌లో టవల్‌ డ్యాన్స్‌ వైరల్‌.. మానవ హక్కుల కమిషన్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాఠశాల అంటే విజ్ఞానం, సంస్కారం నేర్పే దేవాలయం. కానీ, పశ్చిమ బెంగాల్‌లోని ఓ పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. పసిపిల్లల ముందు యువతులు టవల్స్ కట్టుకుని చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించి, పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.

బాలీవుడ్ పాటకు టవల్స్‌తో నృత్యం..

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లా కదంతలా ప్రాంతంలో గల సీబీఎస్‌ఈ (CBSE) గుర్తింపు పొందిన ఓ మోడల్ స్కూల్లో ఇటీవల ఓ ఈవెంట్ జరిగింది. నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఉన్న ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యక్రమంలో విద్యార్థులందరూ ప్రేక్షకుల్లా కూర్చున్నారు. ఈ క్రమంలో స్టేజ్‌పై కొందరు యువతులు కేవలం తెల్లటి టవల్స్ చుట్టుకుని, ప్రముఖ బాలీవుడ్ పాట ‘మేరే ఖ్వాబోం మే జో ఆయే’ పాటకు నృత్యం చేశారు.

‘ముజ్రా’ను తలపిస్తోందంటూ నెటిజన్ల ఫైర్

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. ఈ ప్రదర్శనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది స్కూల్ ఈవెంట్‌లా లేదని, ‘ముజ్రా’ డ్యాన్స్‌ను తలపిస్తోందని తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. పసిపిల్లలు, వివిధ వయసుల విద్యార్థులు ఉన్న సభలో ఇలాంటి ‘అసహ్యకరమైన’ నృత్యాలు చేయించడం ఏంటని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు.

రంగంలోకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ

పాఠశాలలో ఇలాంటి కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన ఉపాధ్యాయులు, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ తీవ్ర దుమారం, విమర్శల నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుని పాఠశాలకు నోటీసులు జారీ చేసింది.

Next Story