సైనికులకు సెల్యూట్ చేస్తున్న టోల్ గేట్ల సిబ్బంది

by Muthe.Rajitha |   (  Updated:2025-08-22 10:59:34  IST  )

ఉత్తరప్రదేశ్‌లో టోల్ గేట్ల సిబ్బంది ఆర్మీ జవాన్లకు సెల్యూట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

సైనికులకు సెల్యూట్ చేస్తున్న టోల్ గేట్ల సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో టోల్ గేట్ల సిబ్బంది ఆర్మీ జవాన్లకు సెల్యూట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ని మీరట్‌లో భూని టోల్ ప్లాజా వద్ద ఆర్మీ జవాన్ కపిల్ కవడ్‌పై టోల్‌గేట్ సిబ్బంది దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కపిల్ సెలవులపై ఇంటికి వచ్చి తిరిగి విధుల్లో చేరేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్తూ టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్ జామ్‌పై ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. సిబ్బంది అతడిని స్తంభానికి కట్టి, కర్రలతో, ఇటుకతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా టోల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తమైంది.

ఈ ఘటనను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సీరియస్ గా తీసుకుంది. టోల్ నిర్వహణ ఏజెన్సీ అయిన ధరమ్ సింగ్‌పై రూ. 20 లక్షల జరిమానా విధించి, కాంట్రాక్ట్‌ను రద్దు చేసి, భవిష్యత్తులో టోల్ బిడ్‌లలో పాల్గొనకుండా నిషేధించింది. అలాగే యూపీ పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటన అనంతరం టోల్ సిబ్బందికి NHAI కఠిన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. టోల్ ప్లాజా వద్ద సైనికులకు సెల్యూట్ చేయాలని, నీటిని అందజేయాలని, వారి ఐడీ కార్డులను ఉన్నత అధికారులు మాత్రమే చెక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మీరట్‌లోని కాశీ టోల్ ప్లాజా వద్ద సైనిక వాహనాలకు సెల్యూట్ చేస్తూ, సైనికులకు నీళ్లు అందిస్తూ టోల్ సిబ్బంది మర్యాదగా వ్యవహరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story