కాటేసిన రక్తపింజరిని చంపి.. ఆస్పత్రికి వెంట తెచ్చిన బాధితుడు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-03 08:24:29  IST  )

నెల్లూరు జిల్లా కోవూరులో తనను కాటేసిన రక్తపింజరి పామును చంపి, చికిత్స కోసం ఆస్పత్రికి వెంట తెచ్చిన వలీ అనే వ్యక్తి సాహసం స్థానికంగా కలకలం రేపింది.

కాటేసిన రక్తపింజరిని చంపి.. ఆస్పత్రికి వెంట తెచ్చిన బాధితుడు!
X

దిశ, వెబ్‌డెస్క్: పాము కనిపిస్తేనే మనం ఆమడదూరం పరుగెత్తుతాం. ఇక కాటేస్తే.. చేసే హడావుడికి అంతే ఉండదు. కానీ, నెల్లూరు (Nellore) జిల్లాలో ఒక వ్యక్తి మాత్రం తనను కాటేసిన పామును చంపడమే కాకుండా, దాన్ని చేత్తో పట్టుకుని నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. కోవూరు (Kovuru) పట్టణంలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన వలీ (Wali) అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన రక్తపింజరి వలీ చేతిపై కాటేసింది. దీంతో అతడు క్షణాల్లో అప్రమత్తమయ్యాడు. తాను ఎక్కడ ఆ పాము కాటుతో తాను చనిపోతానేమోనన్న భయం కలిగినా.. ధైర్యం కోల్పోకుండా వెంటనే ఆ పామును అక్కడికక్కడే కొట్టి చంపేశాడు.

ఆస్పత్రిలో అంతా షాక్..

అనంతరం చనిపోయిన పామును పట్టుకుని వలీ నేరుగా కోవూరు ప్రభుత్వాసుపత్రి (Kovur Government Hospital)కి చేరుకున్నాడు. చేతిలో పామును చూసిన తోటి రోగులు, వైద్య సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తనకు కాటు వేసింది ఏ పామో వైద్యులకు చూపిస్తే సరైన చికిత్స అందుతుందనే ఉద్దేశంతోనే దానిని వెంట తెచ్చినట్లుగా వలీ తెలిపాడు. ఈ మేరకు వలీకి ప్రాథమిక చికిత్స అందించిన కోవూరు వైద్యులు, రక్తపింజరి విషం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పామును చంపి ఆస్పత్రికి తీసుకురావడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Next Story