నువ్వు లేవనే వార్త నన్ను బాధిస్తోంది.. నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్ పోస్ట్

by Kema Shiva Kumar |

తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కన్నుమూసిన విషయం తెలిసిందే.

నువ్వు లేవనే వార్త నన్ను బాధిస్తోంది.. నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (Niranjan) ఇవాళ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇటీవల హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి, ఆ చిన్నారిని పరామర్శించిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆ విడుదల చేసిన ప్రకటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.

నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అతడి ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయని తెలిపారు. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే తన కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి.. తనను చూడగానే అతడి ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు.. ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పవన్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.

అంతులేని ధైర్యం.. కలచివేస్తున్న జ్ఞాపకాలు

చిన్నారి నిరంజన్ వ్యాధితో పోరాడినా, అతడి మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవని కొనియాడారు. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిరంజన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని పవన్ తెలియజేస్తూ, వారికి ఈ తీరని దు:ఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ‘ప్రియమైన నిరంజన్.. నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటు పవన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story