భార్యకు భార్య చెల్లు.. తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్న భర్త

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-11-12 08:21:36  IST  )

తన భార్యను వలలో వేసుకోని లేపుకెళ్లిన వ్యక్తిపై ఓ భర్త ప్రతీకారం తీర్చుకున్నాడు.

భార్యకు భార్య చెల్లు.. తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్న భర్త
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాహేతర సంబంధాల కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భర్త, పిల్లలు ఉన్నా మహిళలు పరాయి పురుషుడితో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. భర్తలు సైతం కుటుంబ బాధ్యతలు మరిచి, ఇంటిల్లీపాదిని వదిలేసి మరో మహిళతో ఎఫైర్ పెట్టుకోవడానికి సై అంటున్నారు. ఈ సంఘటనలకు అనేక కారణాలు ఉన్నా.. తాజాగా జరిగిన ఓ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన భార్యను వలలో వేసుకోని లేపుకెళ్లిన వ్యక్తిపై ఓ భర్త ప్రతీకారం తీర్చుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా కర్మ సిద్ధంతాన్ని పాటించి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం..

బిహార్‌లోని ఖగారియా జిల్లాలో నీరజ్‌కు 2009లో రూబీదేవితో వివాహం జరిగింది. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి సంసారానికి గుర్తుగా నలుగురు పిల్లలు జన్మించారు. 11 ఏళ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలో అలజడి రేగింది. రూబీదేవికి ముఖేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి కుటుంబంలో గొడవలకు దారితీసింది. రూబీదేవిని తన మాటలతో ఆకట్టుకున్న ముఖేష్.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇక అతడిని వదిలేసి ఉండలేని స్థితికి వచ్చిన రూబీదేవి.. భర్త నీరజ్‌ను, పిల్లలను వదిలేసి 2022 ఫిబ్రవరిలో ముఖేష్‌తో వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరు వేరు కాపురం పెట్టేశారు. ఈ సంఘటనతో షాక్ తిన్న నీరజ్.. తన భార్యను ముఖేష్ కిడ్నాప్ చేశాడని ఖగారియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఈ జంట పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతూ రహస్యంగా జీవనం కొనసాగిస్తున్నారు.

మరోవైపు నీరజ్.. తనకు జరిగిన అన్యాయంపై గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. కానీ అక్కడ కూడా అతడికి సరైన న్యాయం దొరకలేదు. దీంతో ముఖేష్ ఎవరు..? అతడి కుటుంబం ఎక్కడ ఉంటుందనే వివరాలపై ఎంక్వైరీ చేశాడు. ఆ సమయంలో నీరజ్‌కు దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. ముఖేష్‌కు రూబీ అనే మహిళతో అంతకు ముందే వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. నాతో పాటు మీకు కూడా నీ భర్త అన్యాయం చేశాడని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరాడు. మీరు సహకరిస్తే మనిద్దరం పెళ్లి చేసుకుని ప్రతీకారం తీర్చుకుందామని నచ్చజెప్పాడు. దీనికి ముఖేష్ భార్య రూబీ అంగీకరించింది. దీంతో ఈ జంట 2023 ఫిబ్రవరిలో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కరెక్టుగా ఏడాది తర్వాత తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తి భార్యను పెళ్లి చేసుకోని ‘భార్యకు భార్య చెల్లు’ అన్న విధంగా నీరజ్ ప్రతీకారం తీర్చుకోవడం సంచలనం సృష్టించింది. అయితే ఈ సంఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం.


Next Story