చిరుతపై దాడి చేసి.. 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన వీధి కుక్క (వీడియో)

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-24 12:15:57  IST  )

ఇటీవల కాలంలో జనావాసాల మధ్య చిరుతల సంచారం కలకలం రేపుతోంది.

చిరుతపై దాడి చేసి.. 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన వీధి కుక్క (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో జనావాసాల మధ్య చిరుతల సంచారం కలకలం రేపుతోంది. కొన్ని గ్రామాల్లో చిరుతల సంచారం వార్తలు గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు వీధికుక్కల దాడులు కూడా అలాగే ఉన్నాయి. ఢిల్లీలోని ఎన్సీఆర్ లో వీధికుక్కల బెడద పెరిగిపోవడంతో.. వాటన్నింటినీ ఒక ప్రాంతానికి చేర్చాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై జంతు ప్రేమికులు మండిపడ్డారు. వీధికుక్కలకు ఎక్కడపడితే అక్కడ ఆహారం పెట్టొద్దని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాసిక్ లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

రెండు వీధికుక్కలకు చిరుత ఎదురుపడగా.. ఆ చిరుత పని పట్టాయి. దానిపై దాడి చేసి.. ముఖాన్ని పట్టుకుని 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాయి. నాసిక్ లోని నిఫాద్ లో జరిగిన ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది నెట్టింట చక్కర్లు కొడుతోంది. కుక్కల దాడిని తట్టుకోలేక పులి వాటిని వదిలి పోలాల్లోకి పరారైందని స్థానికులు తెలిపారు. ఆ ప్రాంతంలో నివసించే వారికి చిరుత వల్ల ఎలాంటి హాని జరగలేదు. కాగా.. కుక్కల దాడిలో గాయపడిన చిరుతకు ఏ స్థాయిలో గాయాలయ్యాయి, దానికి వైద్యం చేయాల్సిన అవసరం ఉందా ? అన్న విషయాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఏదేమైనా.. వీధికుక్కలు చిరుతను ఎదురించకపోయి ఉంటే.. చిరుత తమపై దాడి చేసేదని గ్రామస్తులు వాపోయారు.

Next Story