పిల్లల ప్రాణాలతో చెలగాటం: ఈ వీడియో చూస్తే మ్యాంగో పుల్లైస్ మళ్లీ కొనివ్వరు !

by Naga Rani Yarlagadda |

వేసవిలో పిల్లలు ఐస్ క్రీమ్స్ తినేందుకు చాలా ఇష్టపడతారు. అందులోనూ పుల్లైస్ అంటే ఎగిరి గంతేస్తారు. కానీ.. దానిలో ఎన్నిరసాయనాలు ఉన్నాయో తెలిస్తే మళ్లీ కొనివ్వరు

పిల్లల ప్రాణాలతో చెలగాటం: ఈ వీడియో చూస్తే మ్యాంగో పుల్లైస్ మళ్లీ కొనివ్వరు !
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. వీధి చివర వినిపించే గంట శబ్దం కోసం పిల్లలు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. కేవలం పది రూపాయలకే దొరికే ఆ రంగు రంగుల పుల్లైస్, ముఖ్యంగా మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్యాండీలను చిన్నారులు అమితంగా ఇష్టపడతారు. అయితే, ఈ పుల్లైస్ తయారీకి సంబంధించి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తోంది.

పండ్లు లేవు.. అంతా రసాయనాలే!

వైరల్ అవుతున్న వీడియోలో.. మ్యాంగో పుల్లైస్ తయారీలో అసలు మామిడి పండు ఛాయలే కనిపించడం లేదు. కేవలం కెమికల్ ఫ్లేవర్లు, సింథటిక్ రంగులు, అత్యధిక మోతాదులో చక్కెర కలిపిన నీళ్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఆకర్షణీయమైన పసుపు రంగు కోసం వాడే రసాయనాలు పారిశ్రామిక అవసరాలకు వాడేవని, ఇవి ఏమాత్రం ఆహార యోగ్యం కావని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా రసాయనాలతో కూడిన ఐస్ క్యాండీలు తినడం వల్ల చిన్నారులలో రోగనిరోధక శక్తి దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కలుషిత నీరు, హానికారక రసాయనాల వల్ల డయేరియా, వాంతులు, ఇతర ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటిలో వాడే 'మెటానిల్ ఎల్లో' వంటి రంగులు కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొంతమంది పిల్లల్లో అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలకు కూడా దారితీయవచ్చు. చౌకగా దొరుకుతున్నాయని రోడ్డు పక్కన అమ్మే ఇలాంటి రంగు రంగుల పుల్లైస్ కొనిచ్చి పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా ఇంట్లోనే తాజా పండ్ల రసాలతో ఐస్ క్యాండీలు తయారు చేసి ఇవ్వడం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు.

Next Story