మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు దొంగతనం.. హై స్పీడ్ ఛేజింగ్, క్లైమ్యాక్స్ అదుర్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-10 05:16:43  IST  )

జనగామ పట్టణ కేంద్రంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు దొంగతనం.. హై స్పీడ్ ఛేజింగ్, క్లైమ్యాక్స్ అదుర్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’ అని.. పెద్దలు ఊరికే అనలేదండోయ్. తాగిన మత్తులో మందుబాబులు ఏం చేస్తారో అనడానికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ జనగామ (Jangaon) పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. గురువారం రాత్రి జనగామ బస్టాండ్‌ ఆవరణలో ఓ ఆర్టీసీ అద్దె బస్సు (Hired Bus)ను డ్రైవర్ పార్క్ చేసి వెళ్లాడు. ఈ క్రమంలోనే మంద్యం మత్తులో అటుగా వచ్చిన పాలకుర్తి (Palakurthi) మండలానికి చెందిన వెంకన్న (Venkanna) బస్సులో డ్రైవర్, కండక్టర్ లేకపోవడాన్ని గమనించాడు. తాగిన రిమ్మ తిరినట్టుంది.., నేరుగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని బస్సును స్టార్ట్ చేశాడు. అనంతరం బస్టాండ్ నుంచి బస్సును రోడ్డుపైకి తీసుకెళ్లి సూర్యాపేట వైపు పోనిచ్చాడు.

21 కిలో మీటర్ల హై స్పీడ్ ఛేజింగ్..

అయితే, వెంకన్నకు బస్సు డ్రైవింగ్ సరిగ్గా రాకపోయినా, మద్యం మత్తులో ఉండటంతో సూర్యాపేట (Suryapet) బిజీ హైవేపై జిగ్‌జాగ్‌గా బస్సును నడుపుతూ ప్రయాణికులను, ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. అలా దాదాపు 21 కి.మీ దూరం బస్సును తోలుకుంటూ వెళ్లాడు. అయితే, సింగరాజుపల్లి (Singrajupally) టోల్‌గేట్ వద్దకు రాగానే సీన్ రివర్స్ అయింది. టోల్ ప్లాజా క్యూ లైన్‌ను అంచనా వేయడంలో విఫలమైన వెంకన్న.. నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న సిమెంట్ దిమ్మెను బస్సుతో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై ఆగిపోయింది. టోల్‌గేట్ సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బస్సు ప్రమాదానికి గురైన సమాచారం అందుకున్న జనగామ పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వెంకన్నను కిందకు దించి చూడగా.. అతడు నడవలేని స్థితిలో మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story