- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోథ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. మళ్లీ బలపడుతున్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు
బోథ్ నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, బజార్ హత్నూర్: బోథ్ నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మరోసారి ప్రజల్లో తన పట్టును పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా వినిపిస్తోంది. గ్రామాలు, మండలాల వారీగా పర్యటిస్తూ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ తన రాజకీయ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజకీయ వేదికగా అవతరించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని నూతన రాజకీయ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, బోథ్ నియోజకవర్గంలో తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయంగా చురుగ్గా మారారు. ఆయన చేరికతో నియోజకవర్గంలో కొత్త రాజకీయ చర్చ మొదలైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో బోథ్ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాథోడ్ బాపూరావు, ప్రస్తుతం మళ్లీ తన పాత అనుచర వర్గాన్ని కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.
మద్దతును పెంచుకునే దిశగా...
గతంలో ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా తిరిగి దగ్గరవుతుండటం ఆయన రాజకీయ పునరాగమనానికి బలం చేకూరుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాజకీయ ప్రయాణం సాగించిన రాథోడ్ బాపూరావు ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రజా సేవలోకి వచ్చారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సమస్యలపై పనిచేసిన నాయకుడిగా బోథ్ ప్రజల్లో గుర్తింపు పొందారు. 2014లో బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, 2018 ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి తన రాజకీయ ప్రభావాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం బోథ్ నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి నాయకులు, కార్యకర్తలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ, ప్రజల్లోకి వెళ్లి మద్దతును పెంచుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో బోథ్ రాజకీయాల్లో రాథోడ్ బాపూరావు పాత్ర కీలకంగా మారుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు బోథ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన రాథోడ్ బాపూరావు, కొత్త రాజకీయ వేదికతో మరోసారి తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






