దశాబ్దకాల నిరీక్షణకు తెరపడేనా..?

by Kodari Anjali |

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న బోనకల్ మండలంలో వ్యవసాయ శాఖకు గత పదేళ్లుగా శాశ్వత కార్యాలయం లేకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

దశాబ్దకాల నిరీక్షణకు తెరపడేనా..?
X

దిశ, బోనకల్: వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న బోనకల్ మండలంలో వ్యవసాయ శాఖకు గత పదేళ్లుగా శాశ్వత కార్యాలయం లేకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకప్పుడు ఉన్న వ్యవసాయ శాఖ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి వినియోగానికి పనికిరాకపోవడంతో, ప్రస్తుతం వ్యవసాయ అధికారి (ఏవో) రైతు వేదికలోనే విధులు నిర్వహిస్తున్నారు.మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు మేళాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో, ఈ పర్యటనలోనైనా బోనకల్ వ్యవసాయ శాఖకు ఆధునిక సౌకర్యాలతో కూడిన శాశ్వత కార్యాలయ భవనాన్ని మంజూరు చేయాలని మండల రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తక్షణమే భర్తీ చేయాలి...

శాశ్వత కార్యాలయం లేకపోవడంతో పంటలపై సాంకేతిక సూచనలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, ఎరువులు, విత్తనాల పంపిణీ తదితర సేవల కోసం వచ్చే రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత మండలంలోనే వ్యవసాయ శాఖకు సొంత భవనం లేకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు. అదేవిధంగా మండలంలో ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను తక్షణమే భర్తీ చేసి రైతులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్నాథపురం రైతు మేళా వేదిక నుంచే ముఖ్యమంత్రి బోనకల్ వ్యవసాయ శాఖకు నూతన శాశ్వత కార్యాలయ భవనాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు

Next Story