- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టబోయే ప్రతీ బిడ్డకు బంగారు ఉంగరం: సీఎం సంచలన ప్రకటన
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కరూర్‌లో గతంలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన తర్వాత ఆయన తొలిసారిగా ఇక్కడికి రావడంతో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. సభలో విజయ్ మాట్లాడుతూ.. కరూర్ తొక్కిసలాట ఘటన తన జీవితంలోనే అతిపెద్ద విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందంటూ సీఎం విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. "ఆ రోజు కరూర్ పోలీసులు మమ్మల్ని అప్రమత్తం చేయలేదు. అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉందనే విషయం పోలీసులకు ముందే తెలుసు. అయినప్పటికీ మమ్మల్ని కావాలనే మీటింగ్ ప్రాంగణానికి తీసుకెళ్లారు" అని విజయ్ మండిపడ్డారు.
పాలనలో విశ్వరూపం చూపిస్తాం..
ఇదే వేదికపై నుంచి విపక్షాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో తమను చూసి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతికి తావులేదని, అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 'టీవీకే' పాలన ఎలా ఉంటుందో, ప్రభుత్వ విశ్వరూపం ఏంటో ప్రజలకు త్వరలోనే చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పకుండా అమలు చేస్తామని సీఎం విజయ్ పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే.. రాష్ట్రంలో త్వరలో పుట్టబోయే బిడ్డలకు తమ ప్రభుత్వం తరపున బంగారు ఉంగరాలు అందిస్తామని ఒక వినూత్న ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కరూర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






