ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే ఆల్కహాల్‌ కలిసిన ఔషధాల విక్రయాలు.. కేంద్రం గెజిట్ రిలీజ్

by Prasad Jukanti |   (  Updated:2026-07-10 08:43:33  IST  )

2% కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉండి, 30ml దాటిన మందులను షెడ్యూల్ H1 లోకి మారుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే ఆల్కహాల్‌ కలిసిన ఔషధాల విక్రయాలు.. కేంద్రం గెజిట్ రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఆల్కహాల్ ఆధారిత ఔషధాల నియంత్రణను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగిన ఔషధాలను లైసెన్స్‌ లేకుండా విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే ఈ మందులను విక్రయించాలని పేర్కొంది. ఈ మేరకు 'డ్రగ్స్ రూల్స్, 2026'ను ప్రభుత్వం నోటిఫై చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్‌ ఆల్కహాల్‌ కలిగి 30 మిల్లీలీటర్ల కంటే పెద్ద సీసాల్లో విక్రయించే సిరప్‌లు/టానిక్‌లను షెడ్యూల్ H1 పరిధిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.

మత్తు కోసం దుర్వినియోగంతో:

కొన్ని రకాల దగ్గు సిరప్‌లు, టానిక్‌లలో ఔషధాల స్థిరత్వం కోసం, క్రియాశీల పదార్ధాలను కరిగించడం కోసం ఇథైల్ ఆల్కహాల్‌ను ఎక్కువ శాతం ఉపయోగిస్తారు. అయితే ఈ ఔషధాలు సులభంగా లభిస్తుండటంతో వీటిని చికిత్స కోసం కాకుండా మత్తు కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విషయంలో పలు రాష్ట్రాల నుంచి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ (DCC), డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB) ల సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అవసరమైన రోగులకు ఈ ఔషధాలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి. కానీ రిజిస్టర్డ్ డాక్టర్ ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ మందులు విక్రయించనున్నారు. అలాగే వీటి విక్రయానికు సంబంధించిన వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నియంత్రణ అధికారుల తనిఖీల కోసం ఆ ప్రిస్క్రిప్షన్లు, విక్రయ రికార్డులను కనీసం మూడేళ్ల పాటు భద్రపరచాల్సి ఉంటుంది.

Next Story