- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి పలువురు మృతి
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడగా.. పలువురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడగా.. పలువురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. యూపీలోని సంత్ కబీర్ నగర్, కుషినగర్, బులంద్ షహర్, షమ్లీ, ఘజియాబాద్ లలో వర్షాల కారణంగా కొందరు మరణించారు. భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవ్వగా.. సూరత్ లో రోడ్లు జలమయమై వాగులను తలపిస్తున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్ లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు అలకనంద, మందాకిని నదులు పొంగి పొర్లుతుండగా.. మరోసారి అతిభారీ వర్షాల హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమై.. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలో స్కూళ్లను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ లో 75 ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమవ్వగా.. 29 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు వర్షాలు, గాలులకు పాడైనట్లు గుర్తించారు. భారీ వర్షాల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరకాశి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి హైవే మూసుకుపోయింది.
ఉత్తరప్రదేశ్ లోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ.. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాజియాబాద్, మేరఠ్, హాపూర్, బులంద్ షహర్, బాఘ్ పత్, ముజఫర్ నగర్, మొరాదాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు ముందుగానే సెలవు ప్రకటించారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.






