- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌పై రెచ్చిపోయిన బండి సంజయ్.. బీజేపీ నేతలకు సంచలన పిలుపు
హైదరాబాద్‌లోని చెరువుల ఆక్రమణలు, హైడ్రా (HYDRAA) కూల్చివేతల వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చెరువుల ఆక్రమణలు, హైడ్రా (HYDRAA) కూల్చివేతల వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన విద్యాసంస్థల ఆక్రమణల అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రపంచమంతా చూస్తున్నా... ఒవైసీ కళాశాల చెరువులో లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తోంది. హైడ్రా పేరుతో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే ప్రభుత్వం.. అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న ఈ ఆక్రమణను మాత్రం ఎందుకు చూడలేకపోతోంది?" అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు కంటి చూపు సమస్యా? లేక రాజకీయ సంకల్పం లోపించిందా? అని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ శ్రేణులకు ఆయన ఒక వినూత్న పిలుపునిచ్చారు. ప్రతి బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ నాయకుల కోసం ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలు నిర్వహించాలని సూచించారు. "నేత్ర పరీక్షల తర్వాత కూడా వారికి అక్కడ చెరువు కనిపించకపోతే.. సమస్య కంటి చూపులో లేదు, వారి రాజకీయాల్లోనే ఉందనేది స్పష్టమవుతుంది" అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అవసరాల కోసమే FTL గీతలు మారుతున్నాయి..
చెరువుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయ అవసరాలకు అనుగుణంగానే ఎఫ్ఎఎల్ (Full Tank Level) గీతలు మారుతున్నాయనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో బలపడుతున్నాయని పేర్కొన్నారు. "పేదలకు ఒక న్యాయం.. అధికార పక్షానికి, వారి మిత్రపక్షాలకు దగ్గరగా ఉన్నవారికి మరో న్యాయమా? చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలి కానీ.. ఇలా సెలెక్టివ్‌గా ఎంపిక చేసుకుని అమలు చేయడం సరికాదు" అని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరిని వీడాలని, రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తున్న నిజం ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.






