సమయపాలన పాటించని డాక్టర్లపై కలెక్టర్ ఆగ్రహం

by Taduka Kalyani |

ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్దేశిత సమయ వేళలు పాటించకుండా, విధుల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు, ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

సమయపాలన పాటించని డాక్టర్లపై కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, కొండపాక: ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్దేశిత సమయ వేళలు పాటించకుండా, విధుల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు, ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. శుక్రవారం ఉదయం కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి తనిఖీ సందర్భంగా ఉదయం 9:58 నిమిషాలైనా ఒక్క అటెండర్ మినహా, మెడికల్ ఆఫీసర్ నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు ఎవరూ విధులకు హాజరుకాకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని సిబ్బందిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆసుపత్రులలో అన్ని రకాల సదుపాయాలను కల్పించిందని గుర్తుచేశారు. వైద్యులు, సిబ్బంది నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటూ ఓపికతో సేవలు అందించాలని సూచించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

Next Story