మహిళలు, బాలికలను కించపరిచే పోస్టులను సహించం : మంత్రి కొలుసు పార్ధసారధి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో సోషల్ మీడియా దుర్వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, దీనిపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు.

మహిళలు, బాలికలను కించపరిచే పోస్టులను సహించం : మంత్రి కొలుసు పార్ధసారధి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సోషల్ మీడియా దుర్వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, దీనిపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. కేబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హననం వల్ల సమాజం, పాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని డీజీపీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాజకీయ ప్రత్యర్థులపై సోషల్ మీడియా ద్వారా కొందరు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని, కొన్ని పార్టీలు వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయ మీడియాకు ఉన్న నైతిక విలువలు.. సోషల్ మీడియాలో కొందరికి లేకుండా పోయాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలను కించపరుస్తూ పోస్టులు పెడితే.. అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వం సహించబోదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక రెస్పాన్స్ సెల్, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్వేషాలు వ్యాప్తి చేసే వారిని గుర్తించేందుకు లేటెస్ట్ ఫోరెన్సిక్ టూల్స్ వాడాలని నిర్ణయించారు. సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి.. దేశ, విదేశాల్లో అమల్లో ఉన్న చట్టాలపై జీఓఎం అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారని.. మంత్రి పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారమవుతుండగా.. వాట్సప్ యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఈ సమస్యలు మరింత పెరుగుతాయని డీజీపీ అభిప్రాయపడ్డారు.

ఇక రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఎల్ నినో ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారన్నారు. విత్తనాల కొనుగోలుకు మార్క్ ఫెడ్ ద్వారా నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య దక్కేలా సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధి చేయాలని, బీసీ,ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు అని కాకుండా.. విద్యార్థులంతా కలిసి మెలిసి చదువుకునే వాతావరణం తీసుకురావాలన్నారు. ప్రైవేట్ హాస్టళ్లకు ధీటుగా సంక్షేమ హాస్టళ్లను తీర్చిదిద్దాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అలాగే ప్రతి మంత్రి నెలనెలా తమ శాఖల ఆర్థిక స్థితిగతులను సమీక్షించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

Next Story