ఓఆర్ఆర్ పై ప్రమాదాల నివారణకు ఏఐ (AI)తో నిఘా.. 80 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు

by Malleboina Mahesh |

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు 80 క్రిటికల్ స్పాట్స్ గుర్తింపు.. ట్రాఫిక్ నిఘా కోసం త్వరలో ఏఐ (AI) సాంకేతికత!

ఓఆర్ఆర్ పై ప్రమాదాల నివారణకు ఏఐ (AI)తో నిఘా.. 80 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ప్రజా భద్రతను మెరుగుపరచడం తో పాటు రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) లో అన్ని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో ఒక కీలక సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో హెచ్‌ఎండీఏ, ఎన్‌హెచ్‌ఏఐ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌జీసీఎల్, ఐఆర్బీ ఇన్‌ఫ్రా ప్రతినిధులతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత మే నెలలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్షించడం తో పాటు, ఓఆర్ఆర్ పై తరచుగా ప్రమాదాలు జరిగే అవకాశమున్న 80 అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలను (Critical Spots) అధికారులు గుర్తించినట్లు వివరించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ పటిష్టం చేసినట్లు వెల్లడించారు.

రహదారిపై భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు అత్యాధునిక ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టమ్‌’ను అమల్లోకి తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏఐ సాంకేతికత ద్వారా అతివేగం, లైన్ డిసిప్లిన్ తప్పడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను సులభంగా గుర్తించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. దీనివల్ల పదే పదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుల ధోరణికి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈ భేటీలో తీర్మానించారు.

Next Story