- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలంపల్లి సర్పంచ్ ఆరు నెలల పాటు సస్పెన్షన్
చేగుంట మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ,చేగుంట: చేగుంట మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 37(1)(ii), (iii), (iv) కింద అధికారాల దుర్వినియోగం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలు నిర్ధారణ కావడం తూప్రాన్ డివిజనల్ పంచాయతీ అధికారి సమర్పించిన విచారణ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో సర్పంచ్ భర్త కొండి స్వామి గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను నరికివేయడం, గ్రామపంచాయతీకి చెందిన ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే గ్రామపంచాయతీ మరుగుదొడ్లను కూల్చివేయడం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలో వెల్లడైంది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో సర్పంచ్ భర్త పాల్గొంటూ సర్పంచ్ అధికారాలను వినియోగిస్తున్నట్లు కూడా విచారణలో స్పష్టమైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధి స్థానంలో ఆమె భర్త వ్యవహరించడం చట్ట విరుద్ధమని సర్పంచ్ తన అధికారాలను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018లోని సెక్షన్ 37(5) ప్రకారం పోలంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలలపాటు తాత్కాలికంగా పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో కొండి రాజ్యలక్ష్మి సర్పంచ్ హోదాలో ఎలాంటి అధికారాలను వినియోగించే హక్కు ఉండదని గ్రామపంచాయతీ పరిపాలనా విధులు నిర్వహించడానికి అర్హత ఉండదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశం మినహా గ్రామపంచాయతీ సమావేశాల్లో పాల్గొనే హక్కు కూడా ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.






