వృత్తి గౌరవాన్ని కాపాడుకోవడమే నిజమైన జర్నలిజం: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

by Malleboina Mahesh |

సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన కృతజ్ఞత సభలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వృత్తి గౌరవాన్ని కాపాడుకోవడమే నిజమైన జర్నలిజం: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నీతి, నిజాయితీ, నిర్భీతితో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకునే వారే నిజమైన జర్నలిస్టులని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో కొందరు అక్రెడిటేషన్ కార్డులను అంగట్లో సరుకుగా మార్చి వృత్తి విలువను దెబ్బతీశారని విచారం వ్యక్తం చేశారు. మీడియా రంగాన్ని కలుషితం చేసే వారిని గుర్తించి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వీడియో జర్నలిస్టులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని, 'వీడియో గ్రఫీ డే'ను అధికారికంగా నిర్వహించే యోచనలో ఉన్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ... వీడియో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి తమ సంఘం కట్టుబడి ఉందని, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీడియో జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని విరాహత్ అలీ కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు హరీష్, ప్రధాన కార్యదర్శి సన్నీ, వనం నాగరాజు, బి.కిరణ్ కుమార్, యూసుఫ్ బాబు, అశోక్, కె.ఎన్. హరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టులకు మీడియా అకాడమీ చైర్మన్ అక్రెడిటేషన్ కార్డులను అందజేశారు.

Next Story