మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు మరో 100 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు

by Malleboina Mahesh |

ఏపీకి మరో 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీ. హర్షం వ్యక్తం చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు మరో 100 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక విజయాన్ని సాధించింది. రాష్ట్రానికి అదనంగా మరో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య మంత్రి సత్య కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేస్తూ.. కూటమి ప్రభుత్వ హయాంలో వైద్య విద్య విస్తరణకు ఇది ఒక కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలోనే ఈ సీట్లను భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ అదనపు సీట్లలో రాయలసీమ ప్రాంతంలోనే ప్రముఖ వైద్య సంస్థగా ఉన్న కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు అత్యధికంగా 75 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ కేటాయించింది. దీంతో పాటు నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా మరో 25 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల పెంపుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో ఈ అదనపు సీట్ల మంజూరు ప్రాధాన్యత సంతరించుకుంది. అర్హులైన నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్య సీట్లు లభించడంతో పాటు, భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు.

Next Story