మత ఘర్షణలకు వైసీపీ కుట్ర చేస్తోంది: మంత్రి కందుల దుర్గేశ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-10 16:05:29  IST  )

రాష్ట్రంలో మత ఘర్షణలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆరోపించారు..

మత ఘర్షణలకు వైసీపీ కుట్ర చేస్తోంది: మంత్రి కందుల దుర్గేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మత ఘర్షణలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆరోపించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కుట్రల వెనుక "తాడేపల్లి ప్యాలెస్" స్క్రిప్ట్ ఉందని వ్యాఖ్యానించారు. జోసెఫ్ రావణ్, జడా శ్రావణ్ కుమార్, నటుడు ప్రకాష్ రాజ్‌లు వైసీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి, అంతర్జాతీయ నిధుల కోణంలోనూ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావం సభలో దళితులు, క్రైస్తవుల సంక్షేమ అంశాల కంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి విమర్శించారు. పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు.

జడా శ్రావణ్ కుమార్ గతంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి రూ.25 కోట్లు ఖర్చు చేశానని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వెల్లడించాలని మంత్రి డిమాండ్ చేశారు. అలాగే ఉపా కేసులో అరెస్టైన జోసెఫ్ రావణ్ వెనుక వైసీపీ మద్దతు ఉందని ఆరోపించారు. నటుడు ప్రకాష్ రాజ్ గతంలో కర్ణాటకలోని ధర్మస్థలానికి సంబంధించిన వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బలోపేతం కావడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని మంత్రి దుర్గేశ్ ఆరోపించారు. సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలను సహించబోమని, రాష్ట్రంలో అస్థిరత సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుందని ఆయన హెచ్చరించారు.

Next Story