- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం: సీఎస్ సంజయ్ జాజు
రాష్ట్రంలో చేపడుతున్న కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ శుక్రవారం సెక్రెటేరియట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో చేపడుతున్న కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ శుక్రవారం సెక్రెటేరియట్‌లో పరిశ్రమలు, వాణిజ్య శాఖ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణంగా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయాలని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలు కలుగుతుందని అన్నారు.
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా భారత్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌తోపాటు ఇతర వ్యూహాత్మక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలు, పూర్తి చేయాల్సిన గడువులపై వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎదురయ్యే అవరోధాలను ముందుగానే గుర్తించి, శాఖల మధ్య సమన్వయంతో వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
భారత్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని రూపాంతరం చెందించడంతోపాటు భారీ పెట్టుబడులను ఆకర్షించి, ప్రాంతీయ సమతుల అభివృద్ధికి దోహదపడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, చేనేత, వస్త్ర శాఖ ప్రత్యేక కార్యదర్శి కాత్యాయనీ దేవి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్‌రెడ్డి, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.






