- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వాక్ ఫ్రీ’ పుట్ పాత్ పై సీఎంసీ ఫోకస్.. 488 ఆక్రమణల కూల్చివేత
పాదచారులకు సురక్షితమైన, నిరంతరాయమైన నడక మార్గాలను అందించాలనే లక్ష్యంతో శుక్రవారం మూడు జోన్లలో ఒకేసారి ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు.

దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ‘వాక్ ఫ్రీ’ పేరుతో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాదచారులకు సురక్షితమైన, నిరంతరాయమైన నడక మార్గాలను అందించాలనే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం మూడు జోన్లలో ఒకేసారి ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్లు, సర్కిల్ అధికారులు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించి, పాదచారులకు సురక్షితమైన నడక మార్గాలను పునరుద్ధరించారు.
జోన్‌వారీ పురోగతి..
శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 9.86 కిలోమీటర్లకు సంబంధించిన ఐదు రహదారుల్లో 193 ఆక్రమణలు తొలగించారు. కూకట్ పల్లి జోన్ లో 3.50 కిలోమీటర్లలోని మూడు రోడ్లలో 89, కుత్బుల్లాపూర్ జోన్ లో 8.92కిలోమీటర్లలో ఏడు రోడ్లకు సంబంధించిన 206 ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ జి.సృజన మాట్లాడుతూ ఫుట్‌పాత్‌లు పూర్తిగా పాదచారుల కోసమేనని, వాటిపై ఏ లాంటి ఆక్రమణలను సహించబోమని హెచ్చరించారు. శుక్రవారం 22.28కిలోమీటర్ల మార్గాల్లో 488 ఆక్రమణలను తొలగించినట్టు తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన నడక మార్గాలను అందించేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమణల రహితంగా ఉంచేందుకు ప్రజలు, వ్యాపారులు, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. ‘స్వేచ్ఛగా నడవండి... సురక్షితంగా చేరండి... అందమైన ప్రజా ప్రదేశాలను కలిసి నిర్మిద్దాం’ అనే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు.






