దుష్ప్రచారాన్ని నమ్మకండి: ఎంఎస్, బీఎస్ మక్తావాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అభయం!

by Malleboina Mahesh |

ఎంఎస్, బీఎస్ మక్తా బస్తీల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన.. పేదల ఇళ్లను కూల్చేది లేదని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని అభయం!

దుష్ప్రచారాన్ని నమ్మకండి: ఎంఎస్, బీఎస్ మక్తావాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అభయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖైర‌తాబాద్‌, రాజ్‌భ‌వ‌న్ ఎదురుగా హుస్సేన్‌సాగ‌ర్‌కు ఆనుకుని ఉన్న ఎంఎస్ మ‌క్తా, బీఎస్ మ‌క్తా నివాసితుల‌కు హైడ్రా భ‌రోసా ఇచ్చింది. పేదల ఇళ్లను కూల్చేది లేద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ. రంగ‌నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా ఇదే అని తెలిపారు. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోకి వ‌స్తున్న ఇళ్లను హైడ్రా తొల‌గిస్తుంద‌ని చేస్తున్న దుష్ప్రచారాన్ని న‌మ్మవ‌ద్దని తెలిపారు. క‌బ్జాదారులు కొంత‌మంది స్వార్థ ప్రయోజ‌నాల‌కు మిమ్ముల‌ను ఉప‌యోగించుకుంటున్నార‌ని.. వారి మాట‌లు న‌మ్మవ‌ద్దని హిత‌వు ప‌లికారు. హుస్సేన్‌సాగ‌ర్ ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న ఇళ్లకు హైడ్రా నోటీసుల‌ని త‌ప్పుడు ప్రచారం చేయ‌డమే కాకుండా.. అమాయ‌కుల‌ను ముందు పెట్టి నెక్లెస్ రోడ్డులోని ఎంఎంటీఎస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న చేయించిన వారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం ఆయా ప్రాంతాలను సందర్శించారు. స్థానికులతో నేరుగా మాట్లాడారు.

ఈ విష‌యంలో స్పష్టత ఇద్దామ‌నే తాను ఇక్కడికి వ‌చ్చాన‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ వారితో చెప్పారు. పేద ప్రజల ఇళ్లను కూల్చే ఉద్దేశం ప్ర‌భుత్వానికి.., హైడ్రాకు లేదని తెలిపారు. హైడ్రా ఏర్పాటుకు ముందే ఉన్న నివాసాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మకుంట చెరువు పున‌రుద్ధర‌ణ‌లో కూడా పేద‌ల నివాసాల జోలికి వెళ్లకుండానే అభివృద్ధి చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. బ‌తుక‌మ్మకుంట ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్నా ఇప్పటికే నివాసులున్న వాటిని మిన‌హాయించామ‌న్నారు. రామంతాపూర్ పెద్ద చెరువు ప‌రిధిలో కూడా పేద‌లు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటే.. వారిని ఖాళీ చేయించి డ‌బుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరుకు సిఫార‌సు చేశామ‌న్నారు. హైడ్రా క‌మిష‌న‌ర్ వివ‌రంగా చెప్పడంతో స్థానికులు ఊర‌ట చెందారు. లేని పోని గంద‌ర‌గోళానికి ఆస్కారం లేకుండా నేరుగా హైడ్రా క‌మిష‌న‌ర్ వ‌చ్చి పేద‌ల ఇళ్ల జోలికి వెళ్లమ‌ని స్పష్టం చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Next Story