- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ 'బీటా వర్షన్' ప్రారంభం
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా సరికొత్త 'బీటా వర్షన్'ను రైల్వే శాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

- జైపూర్ ఎంఎన్ఐటీ విద్యార్థులతో రైల్వే అధికారుల భేటీ
- ప్రయాణికులకు సులువుగా టికెట్ బుకింగ్.. నాలుగు కీలక మార్పులు
- త్వరలో సరికొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్
దిశ, తెలంగాణ బ్యూరో : ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా సరికొత్త 'బీటా వర్షన్'ను రైల్వే శాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ, సీఆర్ఐఎస్ ఉన్నతాధికారులు శుక్రవారం జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ఐటీ) విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త వెబ్‌సైట్ బీటా వర్షన్‌ను విద్యార్థులకు ప్రదర్శించి, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించారు. అధికారికంగా లాంచ్ చేయడానికి ముందు మరిన్ని సూచనలు చేయాల్సిందిగా అధికారులను కోరారు.
విద్యార్థుల చొరవతోనే మార్పులు..
కొన్ని వారాల క్రితం ఎంఎన్ఐటీ జైపూర్ విద్యార్థులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోని పలు లోపాలను, సాంకేతిక ఇబ్బందులను రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. జూలై 15 నాటికి వెబ్‌సైట్‌ను పూర్తిగా ఆధునీకరిస్తామని రైల్వే శాఖ అప్పట్లోనే హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే జూలై 10న జైపూర్‌లో ఈ బీటా వర్షన్‌ను విద్యార్థుల సమక్షంలోనే అధికారులు సమీక్షించారు.
నాలుగు ప్రధాన మార్పులు ఇవే..
కొత్తగా రూపొందించిన ఐఆర్‌సీటీసీ బీటా వర్షన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం కింది నాలుగు కీలక మార్పులు చేశారు.
*క్యాప్చా ఇబ్బందులు లేవు: వెబ్‌సైట్‌లో అనవసరమైన క్యాప్చాలు, పాప్-అప్‌లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ వంటి అంతరాయం కలిగించే అంశాలను పూర్తిగా తొలగించారు.
*సీట్ల లభ్యత: అన్ని తరగతుల సీట్ల లభ్యతను ఒకేసారి స్పష్టంగా చూసుకునే వీలుంటుంది.
*వేగవంతమైన బుకింగ్: టికెట్ బుక్ చేసుకునే ప్రక్రియలో స్టెప్స్‌ను తగ్గించారు. దీనివల్ల తక్కువ సమయంలో బుకింగ్ పూర్తవుతుంది.
*రిపీట్ బుకింగ్ సులువు: ప్రయాణికుల వివరాలు ముందే సేవ్ అయి ఉండటం వల్ల.. ప్రతిసారీ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా మళ్లీ బుక్ చేసుకోవచ్చు.
ఆధునిక రిజర్వేషన్ ఇంజిన్
ప్రస్తుతం ఈ సరికొత్త ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ను ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్‌తో అనుసంధానిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల నాటి ఈ పాత రిజర్వేషన్ ఇంజిన్‌ను కూడా సమాంతరంగా ఆధునీకరిస్తున్నారు. నిరంతరం బుకింగ్స్ సాగుతున్నప్పటికీ.. వ్యవస్థకు ఎక్కడా అంతరాయం కలగకుండా ఈ అప్‌గ్రేడేషన్ పనులు చేపట్టడం విశేషం. ఈ పనులన్నీ పూర్తయ్యాక, రాబోయే కొన్ని నెలల్లో పూర్తిస్థాయి కొత్త ఐఆర్‌సీటీసీ పోర్టల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
4 కోట్ల డౌన్‌లోడ్లతో రైల్ వన్ రికార్డు..
రైల్వే సర్వీసుల కోసం తీసుకొచ్చిన రైల్ వన్ యాప్ 4 కోట్ల డౌన్‌లోడ్ల మార్కును దాటి, అత్యంత పెద్ద రైల్వే టికెట్ బుకింగ్ యాప్‌గా అవతరించింది. అన్ని రకాల రైల్వే సేవలు ఈ యాప్‌లో ఒకేచోట లభిస్తున్నాయి. కాగా, తత్కాల్ బుకింగ్స్‌లో బోట్ల ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ఇంకా మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. తమ ఫీడ్‌బ్యాక్‌తో ఈ మార్పులకు కారణమైన ఎంఎన్ఐటీ విద్యార్థులకు రైల్వే శాఖ ధన్యవాదాలు తెలిపింది.






