ఎలక్ట్రిక్ బస్సులు వద్దు డీజిల్ బస్సులే మేలు: ఆర్టీసీ ఎండీకి జేఏసీ విజ్ఞప్తి

by Malleboina Mahesh |

ఎలక్ట్రిక్ బస్సుల్లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించి దగ్ధం అవుతుండడంతో ప్రయాణికులు, ఆర్టీసి సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారని ఆర్టీసీ జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఎలక్ట్రిక్ బస్సులు వద్దు డీజిల్ బస్సులే మేలు: ఆర్టీసీ ఎండీకి జేఏసీ విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాలుష్య నివారణ పేరుతో ఆర్టీసిలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సుల్లో కొన్ని అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించి దగ్ధం అవుతుండడంతో ప్రయాణికులు, ఆర్టీసి సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారని ఆర్టీసీ జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, బి.యాదగిరి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఎలక్ట్రిక్ బస్సులను రిపేర్ చేసేందుకు ఎలక్ట్రిక్ బస్సులు తరలివెళ్లడంతో డిపోలలో పని చేస్తున్న కండక్టర్లకు డ్యూటీలు లేక లీవులు వేయడం, కొంతమందిని ఇతర డిపోలకు బదిలీ చేయడంతో కార్మికులు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. ఆర్టీసీ మొదలైనప్పటి నుంచి డీజిల్ బస్సులనే ఉపయోగిస్తున్నారని, ఇవి ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా పని చేస్తున్నాయని తెలిపారు. ప్రయాణికులకు భద్రత తో పాటు వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు డీజిల్ బస్సులే ఉత్తమమని జేఏసీ భావిస్తోందన్నారు. ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో డీజిల్ బస్సులను ప్రవేశపెట్టాలని కోరారు.

Next Story