- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడికల్ ప్రొక్యూర్‌మెంట్‌లో ఇక ‘డిజిటల్’ విప్లవం!
ప్రభుత్వ హాస్పిటళ్లకు నాణ్యమైన మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

- అవినీతి, ఆలస్యానికి చెక్ పెట్టేలా ‘ఎండ్-టు-ఎండ్’ టూల్
- వైద్య పరికరాల కొనుగోళ్లకు సరికొత్త విధానం
- అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హాస్పిటళ్లకు నాణ్యమైన మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కోఠిలోని టీజీఎంఎస్‌ఐడీసీ ఆఫీసులో శుక్రవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో మెడికల్ ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లు, టెండర్ ప్రాసెస్, ఎక్విప్‌మెంట్ వర్కింగ్ స్టేటస్, మెయింటెనెన్స్ తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.
కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ‘ఎండ్-టు-ఎండ్ డిజిటల్ టూల్’ను త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలన్నారు. దీని ద్వారా ఇండెంట్ పెట్టినప్పటి నుంచి హాస్పిటల్‌లో ఇన్‌స్టాలేషన్ అయ్యే వరకు ప్రతి దశను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసే విధంగా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో అన్ని కొనుగోళ్లు ఒకే విధమైన ప్రామాణిక విధానాల ప్రకారం జరిగేలా నూతన విధానానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటళ్లలో ఏర్పాటు చేసిన మెడికల్ ఎక్విప్‌మెంట్ నిరంతరం పనిచేసేలా పటిష్టమైన మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలోని ఎక్విప్‌మెంట్ పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దీనిని సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో సమీక్షించాలని సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న సీఎఏంసీ (కాంప్రహెన్సివ్ యాన్యువల్ మెయింటనన్స్ కాంట్రాక్ట్) అగ్రిమెంట్లను సమీక్షించి, సర్వీస్ లెవల్ అగ్రిమెంట్స్ పాటించని వెండర్లపై కఠినమైన పెనాల్టీలు విధించేలా నిబంధనలను సవరించాలని మంత్రి స్పష్టం చేశారు. ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్‌లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలన్నారు.
ఎనిమిది మంది బయోమెడికల్ ఇంజినీర్ల నియామకం..
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ ఎక్విప్‌మెంట్ పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఎనిమిది మంది బయోమెడికల్ ఇంజినీర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ రీజియన్‌కు నలుగురు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ జోన్లకు ఒక్కొక్కరిని నియమించి మానిటరింగ్‌ను బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






