దాబాలో బైండోవర్ నిబంధనల ఉల్లంఘన

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, దాబాల్లో సిట్టింగుల నిర్వహణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

దాబాలో బైండోవర్ నిబంధనల ఉల్లంఘన
X

దిశ, పిట్లం (నిజాంసాగర్) : కామారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, దాబాల్లో సిట్టింగుల నిర్వహణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ దాబా యజమానికి రూ.15 వేల జరిమానా విధించడంతో పాటు రూ.1 లక్ష మొత్తానికి మళ్లీ బైండోవర్ చేశారు. పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్లం గ్రామ శివారులో ఉన్న దుర్గ భవాని దాబా యజమాని రాథోడ్ సంతోష్ పై ఈ చర్యలు తీసుకున్నారు. గతంలో 2025 ఆగస్టు 30న అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, సిట్టింగులు నిర్వహించరాదని హెచ్చరిస్తూ పిట్లం ఎస్‌ఐ ద్వారా ఎమ్మార్వో సమక్షంలో రూ.50 వేల పూచీకత్తుతో ఏడాది కాలానికి బైండోవర్ అమలు చేశారు.

మళ్లీ అక్రమాలకు పాల్పడడంతో చర్యలు..

అయితే ఈ ఏడాది మే 17న అదే దాబాలో మళ్లీ అక్రమంగా మద్యం విక్రయాలు, సిట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు, తహసీల్దార్ మహేందర్ కుమార్ సమక్షంలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రాథోడ్ సంతోష్‌కు రూ.15 వేల జరిమానా విధించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా రూ.1 లక్ష మొత్తానికి మరోసారి బైండోవర్ అమలు చేశారు.

అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం: ఎస్పీ

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని దాబా యజమానులు అక్రమ మద్యం విక్రయాలు, సిట్టింగులు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే బైండోవర్ చేసిన వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించడంతో పాటు మరింత భారీ మొత్తాలకు మళ్లీ బైండోవర్ చేస్తామని తెలిపారు. అవసరమైతే చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అక్రమాలపై సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

Next Story