పరిధి దాటిన మానవత్వం

by Ratna Kumari |

పోలీసు విధులకు అధికార పరిధులు ఉన్నప్పటికీ, మానవత్వానికి ఎలాంటి హద్దులు ఉండవని పాలకవీడు ఎస్సై ఆర్. కోటేష్ మరోసారి నిరూపించారు.

పరిధి దాటిన మానవత్వం
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : పోలీసు విధులకు అధికార పరిధులు ఉన్నప్పటికీ, మానవత్వానికి ఎలాంటి హద్దులు ఉండవని పాలకవీడు ఎస్సై ఆర్. కోటేష్ మరోసారి నిరూపించారు. తన విధి పరిధి కాకపోయినా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి వెంటనే సహాయం చేసి ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో సూర్యాపేట జిల్లా పాలకవీడు ఎస్సై ఆర్. కోటేష్ వ్యక్తిగత పనిమీద కారులో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామ శివారులో నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామానికి చెందిన కోటిరెడ్డి బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

ప్రమాదంలో కోటిరెడ్డి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అవుతుండటాన్ని గమనించిన ఎస్సై వెంటనే తన వాహనాన్ని నిలిపి బాధితుడి వద్దకు చేరుకున్నారు. ముందుగా 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడంతో, సమీపంలోని ఆలగడప టోల్‌గేట్ వద్ద ఉన్న అంబులెన్స్‌ను రప్పించి గాయపడిన వ్యక్తిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన తన పోలీస్ స్టేషన్ పరిధిలో కాకపోయినా, బాధితుడి ప్రాణాలను కాపాడేందుకు వెంటనే స్పందించిన ఎస్సై కోటేష్ సేవలను స్థానికులు అభినందించారు. "సహాయం చేయాలంటే అధికార పరిధి అవసరం లేదు.. మంచి మనసు ఉంటే చాలు" అంటూ ఆయన మానవత్వాన్ని కొనియాడారు.

Next Story