ఎన్యూమరేషన్ పత్రం సమర్పిస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేరు..

by Taduka Kalyani |

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డి కీలక స్పష్టత ఇచ్చారు.

ఎన్యూమరేషన్ పత్రం సమర్పిస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేరు..
X

దిశ, ఖైరతాబాద్: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సి. సుదర్శన్ రెడ్డి కీలక స్పష్టత ఇచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక సవరణలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు పంపిణీ చేసే ఎన్యూమరేషన్ పత్రాన్ని ప్రతి ఓటరు పూర్తిగా నింపి సమర్పిస్తేనే జూలై 31న విడుదలయ్యే డ్రాఫ్ట్ (ప్రాథమిక) ఓటర్ల జాబితాలో పేరు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన ఓటర్లను గుర్తించి, బోగస్ ఓట్లను తొలగించే లక్ష్యంతో దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు పేర్కొన్నారు. చివరిసారిగా 2002లో ఇలాంటి సవరణ నిర్వహించగా, ఈసారి కూడా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని ఆయన సూచించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల జూలై 31న విడుదలయ్యే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఈవో స్పష్టం చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ సమయంలో ఫామ్-6 ద్వారా కొత్త ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో బీఎల్వోలు ఇళ్లకు రావడం లేదని, ఎన్యూమరేషన్ పత్రాలు అందించడం లేదని మీడియా ప్రతినిధులు ప్రస్తావించిన అంశంపై సి. సుదర్శన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఎల్వోలు తప్పనిసరిగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను స్వయంగా అందజేసి, ఓటర్ల వివరాలను సేకరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దేందుకు ప్రత్యేక పర్యవేక్షకులను (సూపర్‌వైజర్లు) నియమించినట్లు వెల్లడించారు. అలాగే, హైదరాబాద్ నగరంలో ఓటర్లకు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు సీఈవో తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

Next Story