- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్య హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి
రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు బంద్ నిర్వహించారు.

దిశ, మిర్యాలగూడ రూరల్ : రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌బీ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌బీ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరంగి రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్, ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర కోశాధికారి పోతుగంటి కాశి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యశ్వంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి 4 వేలకే పరిమితం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని ఇప్పటి వరకు నియమించకపోవడం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే చర్యగా పేర్కొంటూ, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరారు. అలాగే విద్య హక్కు చట్టం (ఆర్‌టీఈ)ను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈఓలు, లెక్చరర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి మహిళా సంఘాల ద్వారా నిర్వహించాలని కోరారు. అలాగే మెస్, కాస్మెటిక్ చార్జీలను పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు రూ.250 కోట్లు కేటాయించాలని, ఎన్‌ఈపీ–2020 అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
గత ఆరు సంవత్సరాలుగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.10,500 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌బీ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






