- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతికుండగానే 'మరణ' శాసనం.. పత్రాలన్నీ నకిలీయే
భూముల పరిరక్షణ బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పడగవిప్పుతోంది.

దిశ దమ్మపేట : భూముల పరిరక్షణ బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పడగవిప్పుతోంది. రక్షక కవచంగా నిలవాల్సిన అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతుండటంతో సామాన్య రైతుల ఆస్తులకు రక్షణ కరువైంది. బతికున్న ఓ వృద్ధుడిని రికార్డుల్లో చనిపోయినట్లుగా చిత్రీకరించి, నకిలీ ధృవీకరణ ఈపత్రాలతో ఏకంగా ఐదెకరాల వ్యవసాయ భూమిని పరుల పాలు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో విస్మయం కలిగిస్తోంది. ఈ వ్యవహారంలో కిందిస్థాయి పంచాయతీ సిబ్బంది మొదలుకొని.. ఆర్‌ఐ, తహసీల్దార్ స్థాయి అధికారుల పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
అసలేం జరిగిందంటే...
దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన వృద్ధ రైతు మళ్ళా సత్యం తండ్రి గురవయ్య పేరిట గ్రామంలోని సర్వే నెంబర్ 385/54 లో 5 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ ఆయన జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఈ భూమిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు పక్కా ప్రణాళికతో.. మళ్ళ సత్యం 2018 జూన్ 29వ తేదీనే మరణించినట్లుగా గ్రామ పంచాయతీ నుంచి ఒక నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు.మరణ ధృవీకరణ పత్రం సృష్టించిన అనంతరం, నిందితులు దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (వారసత్వ పత్రం) కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు రాగానే ఆర్‌ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించుకోవాలి. కానీ, ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ జరగకుండానే ఫైల్ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. మళ్ళా సత్యం భార్యగా పుల్లమ్మ మరణించినట్లు, ఆయన కూతురిగా నామా పుష్పావతి ఉన్నట్లుగా పొందుపరిచిన తప్పుడు వివరాలతో.. జూన్ 12, 2025న తహసీల్దార్ కార్యాలయం నుంచి వారసత్వ పత్రం జారీ అయింది. ఈ పత్రాల ఆధారంగా నిందితులు నామా సత్యనారాయణ, పుష్పావతి దంపతులు.. అధికారుల సహకారంతో మే 26, 2026న భూభారతి,ధరణి పోర్టల్ ద్వారా భూమిని మ్యుటేషన్ చేయించుకుని, అధికారికంగా పాస్ బుక్ కూడా పొందారు.
ఓటర్ల సర్వేలో వెలుగులోకి.. కన్నీరుమున్నీరవుతున్న బాధితుడు..
రికార్డుల్లో తాను చనిపోయినట్లు నమోదు కావడంతో, సత్యానికి ప్రతి నెలా వచ్చే ఆసరా పెన్షన్, రైతుభరోసా సాయం నిలిచిపోయాయి. తాజాగా గ్రామంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ సర్వేలో తన పేరు గల్లంతు కావడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఆరా తీయగా తన భూమి అన్యాక్రాంతం అయిందని తెలుసుకున్న ఆ వృద్ధ రైతు దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం మెట్లెక్కాడు. "నేను బతికుండగానే నన్ను చంపేశారు. నాకు ఆసరా పెన్షన్ లేదు, కనీసం రైతు భరోసా లేదు. అధికారుల నిర్వాకంతో నా భూమిని ఆక్రమించుకుని నా కడుపు కొట్టారు.. నా భూమి నాకు ఇప్పించండి" అంటూ కార్యాలయం ఆవరణలో ఆ వృద్ధుడు రోదించిన తీరు పలువురిని కలచివేసింది.
బాధ్యతల నుంచి తప్పుకునే యత్నం..
ఈ కుంభకోణం వెలుగులోకి రావడం, బాధితుడు నేరుగా ఆఫీసుకు వచ్చి నిలదీయడంతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది. వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని గ్రహించిన తహసీల్దార్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఈ బాగోతంపై తాను జీపీవోని నిలదీశానని, "తహసీల్దార్, ఆర్‌ఐల సంతకాలను నేనే ఫోర్జరీ చేశాను, కలెక్టర్ ఎదుట నా తప్పు ఒప్పుకుంటాను" అని ఆమె అంగీకరించిందని చెబుతున్నారు. తీరా కలెక్టర్ వద్దకు వెళ్దాం అనేసరికి సదరు జీపీవో ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తహసీల్దార్ పేర్కొంటున్నారు.
అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన '100 రోజుల ప్రజాపాలన ' సమయంలో దరఖాస్తుల రద్దీ విపరీతంగా ఉందని, ఆ ఒత్తిడిలోనే తన ప్రమేయం లేకుండానే ఈ ఫైల్‌కు డిజిటల్ సైన్ పడిపోయిందని తహసీల్దార్ వింత సమాధానం ఇస్తున్నారు. అయితే, తహసీల్దార్ లాగిన్, బయోమెట్రిక్ లేకుండా డిజిటల్ సైన్ ఎలా సాధ్యమవుతుందని, క్షేత్రస్థాయి విచారణ చేయాల్సిన ఆర్‌ఐ ఎందుకు మౌనం వహించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం కిందిస్థాయి సిబ్బందిపై, ప్రైవేట్ వ్యక్తులపై కేసు పెట్టి అసలు బాధ్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు వెలుగుచూస్తాయని స్థానికులు కోరుతున్నారు.






