తిరుపతిలో జంట హత్యల కేసు.. ముగ్గురి అరెస్ట్

by Vemula.Srinu Prasad |

తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును ఈస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అదనపు ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు...

తిరుపతిలో జంట హత్యల కేసు.. ముగ్గురి అరెస్ట్
X

దిశ, తిరుపతి ప్రతినిధి: తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును ఈస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అదనపు ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సునీల్‌కు తన భార్యతో గత కొంతకాలంగా కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ వివాదాల పరిష్కారం కోసం గ్రామ పెద్ద మునిరత్నం పెద్దమనిషిగా వ్యవహరిస్తూ పంచాయతీ నిర్వహించారని తెలిపారు. అయితే పంచాయతీకి వచ్చిన మునిరత్నంపై ముందస్తు ప్రణాళికతో కత్తులతో దాడి చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.

మనస్పర్థలే...

భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలే ఈ దారుణ ఘటనకు ప్రధాన కారణమని, సునీల్ భార్య గత పది నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇరు కుటుంబాల మధ్య గతం నుంచే పలు కేసులు నమోదై ఉండటంతో పాటు తరచూ గొడవలు జరుగుతుండేవని వెల్లడించారు. ఈ వివాదాల నేపథ్యంలో సునీల్ కుటుంబం గ్రామాన్ని విడిచి వెళ్లినట్లు తెలిపారు.ఈ కేసులో ప్రధాన నిందితులైన తండ్రి వాసు, కుమారులు సునీల్, ఉపేంద్రలను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. కేసుకు సంబంధించిన మరిన్ని అంశాలపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Next Story