- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర హెచ్చరించారు.

దిశ, కామారెడ్డి రూరల్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 51 మందిని గుర్తించారు. వారిని శుక్రవారం సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు మొత్తం రూ.62 వేల జరిమానా విధించడంతో పాటు 13 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్ట ఉల్లంఘనే కాకుండా, అమూల్యమైన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అత్యంత నిర్లక్ష్యమైన చర్య అని పేర్కొన్నారు.
ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏడాది అనేక మంది ప్రాణాలు కోల్పోతుండగా, ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల సొంత ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగిల్చే పరిస్థితి తీసుకురావొచ్చని పేర్కొన్నారు.
"మీ కుటుంబ సభ్యుల కోసం... మీ ప్రాణాల కోసం... మద్యం సేవించి వాహనం నడపవద్దు. రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించండి" అని జిల్లా ప్రజలకు ఎస్పీ రాజేష్ చంద్ర విజ్ఞప్తి చేశారు.






