జాతీయ గీతం, జాతీయ గేయంపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు!

by Malleboina Mahesh |

జాతీయ గీతం, గేయం ఆలపించడంపై కేంద్ర హోంశాఖ తాజా గైడ్‌లైన్స్.. కార్యక్రమాల్లో ముందుగా జాతీయ గేయమే ఆలపించాలని రాష్ట్రాలకు ఆదేశం!

జాతీయ గీతం, జాతీయ గేయంపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు!
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా జాతీయ గీతం (National Anthem - జనగణమన), జాతీయ గేయం (National Song - వందేమాతరం) ఆలపించడం, ప్లే చేయడానికి సంబంధించిన నిబంధనలపై కేంద్ర హోంశాఖ (MHA) సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (UT) పరిపాలనా విభాగాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు హోంశాఖ కీలక ఆదేశాలు పంపింది. ఏదైనా అధికారిక కార్యక్రమం, ఉత్సవంలో జాతీయ గీతం, జాతీయ గేయం రెండింటినీ ఒకేసారి ప్రదర్శించాల్సి వస్తే, ఖచ్చితంగా ముందుగా జాతీయ గేయాన్ని (వందేమాతరం) ప్లే చేయాలని, ఆ తర్వాతే జాతీయ గీతాన్ని (జనగణమన) ఆలపించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

కొన్ని రాష్ట్రాల్లో అధికారికంగా 'రాష్ట్ర గీతాన్ని' (ఉదాహరణకు తెలంగాణలో జయ జయహే తెలంగాణ) కూడా ఆలపిస్తున్న నేపథ్యంలో.. అటువంటి సందర్భాలలో కూడా జాతీయ గేయం, జాతీయ గీతం రెండింటినీ కలిపే ఆలపించాలని, అయితే అన్నింటికంటే ముందుగా జాతీయ గేయానికే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. దీంతో పాటు జాతీయ గీతం, గేయాలను ఆలపించేటప్పుడు వాటి అసలైన లిపి, పాఠ్యం, శైలి, స్పష్టమైన ఉచ్చారణను (Pronunciation) కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అధికారిక టెక్స్ట్ హోంశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని, తమ పరిధిలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా తగిన సూచనలు జారీ చేయాలని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Next Story