ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం.. 11 మంది మేనేజర్లకు చార్జ్ మెమోలు

by Vemula.Srinu Prasad |

జలమండలి పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన 11 మంది మేనేజర్లకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఛార్జ్ మెమోలు జారీ చేశారు....

ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం.. 11 మంది మేనేజర్లకు చార్జ్ మెమోలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జలమండలి పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన 11 మంది మేనేజర్లకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఛార్జ్ మెమోలు జారీ చేశారు. శాఖా విధివిధానాలను ఉల్లంఘించే ఇటువంటి చర్యలను జలమండలి ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు, లో- ప్రెషర్, సీవరేజ్ ఓవర్ ఫ్లో, కలుషిత నీటి సరఫరా, దెబ్బతిన్న మ్యాన్‌హోల్స్, రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు తదితర సమస్యలపై ప్రజలు జలమండలి మెట్రో కస్టమర్ కేర్ తోపాటు సోషల్ మీడియా వేదికలు అయిన, అధికార వెబ్సైట్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ తదితర డిజిటల్ మాధ్యమాల ద్వారా సైతం ఫిర్యాదులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ప్రతి ఫిర్యాదు నమోదైన వెంటనే సంబంధిత అధికారులకు ఆన్‌లైన్‌లో కేటాయించబడటంతో పాటు, ఫిర్యాదుదారునికి ఫిర్యాదు నమోదైనట్లు మొబైల్ కు ఎస్ఎంఎస్ సందేశం పంపబడుతుంది. అదేవిధంగా, అధికారులు సంబంధిత సమస్య క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిష్కారమైన అనంతరం మాత్రమే ఆ ఫిర్యాదును పరిష్కరించినట్టుగా నమోదు చేసి, ఫిర్యాదుదారునికి సమస్య పరిష్కరించినట్లు మరో మొబైల్‌కు ఎస్ఎంఎస్ పరిష్కారమైందని పంపే విధానం అమల్లో ఉంది.

అయితే ఇటీవల నిర్వహించిన సమీక్షలో 11 మంది మేనేజర్లు క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిష్కరించకుండానే పరిష్కరించినట్టు ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు గుర్తించినట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ చర్య ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించకుండా ఫిర్యాదులను పరిష్కరించినట్టుగా నమోదు చేసినట్లు తేలితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు అనివార్యమని హెచ్చరించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి, వాస్తవంగా సమస్య పరిష్కారమైన తర్వాత మాత్రమే ఆన్‌లైన్‌లో పరిష్కారమైనట్టుగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటువంటి చర్యలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా జలమండలి సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, పారదర్శకమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అమలు చేయడం, జలమండలిపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

Next Story