- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి: పవన్ కుమార్ శర్మ
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) గడువులోగా పూర్తి చేయాలని ఈసీఐ ఆదేశం.. హైదరాబాద్‌లో ముగ్గురు ఈఆర్‌ఓలకు షోకాజ్ నోటీసులు!

దిశ, తెలంగాణ బ్యూరో: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై పవన్ కుమార్ శర్మ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు(డీఇఓలు), ఓటరు జాబితా పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ రెన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రత్యేకంగా ఆదేశించారు. సర్ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన జిల్లాల ఎన్నికల అధికారులతో కమిషన్ మాట్లాడి, వారు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకున్నారు. ఆ వ్యూహాలను ఇతర జిల్లాలు కూడా అమలు చేసి, ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసి చేయాలని ఆదేశించారు. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి భారత ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిర్ణీత సమయంలో విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈఆర్ఓలకు షోకాజు నోటీసులు
భారత ఎన్నికల సంఘం అన్ని జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్‌ఐఆర్ పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే డిజిటైజేషన్‌లో తక్కువ పురోగతి కనబరుస్తున్న ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్ఓలు) షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్ అన్ని నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్ఓ), ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పురోగతి, ఫారాల సకాలంలో పూర్తి చేయడం, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ అమలుపై సమగ్రంగా సమీక్షించారు. సమీక్ష సందర్భంగా సనత్‌నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డిజిటైజేషన్ పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత ఈఆర్‌ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, పనితీరు మెరుగుపరచకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈఆర్‌ఓలు డిజిటైజేషన్ ప్రక్రియను ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షిస్తూ, పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా జాప్యాన్ని ఏ మాత్రం సహించబోమని, బాధ్యులపై తగిన పరిపాలనా చర్యలు తప్పకుండా తీసుకుంటామని స్పష్టం చేశారు.






