రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..

by Taduka Kalyani |

పటాన్‌చెరు పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..
X

దిశ, పటాన్‌చెరు, టౌన్: పటాన్‌చెరు పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. ఈ ప్రమాదంలో ఆమె భర్తతో పాటు ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. రేగోడు మండలంలోని కోత్వాన్‌పల్లి గ్రామానికి చెందిన వీరొల్ల గోపాల్ (36) తన భార్య ప్రవళిక (32), పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామానికి వెళ్లిన వారు పనులు ముగించుకుని శుక్రవారం టీఎస్ 09 టీఎస్ 4290 నెంబర్ గల స్కూటీపై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇస్నాపూర్ చౌరస్తా సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ వద్దకు చేరుకోగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌కు చెందిన ట్రైలర్ లారీ (ఎంహెచ్ 46 బీబీ 0793) స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో లారీ చక్రం ప్రవళికపై నుంచి వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వెంటనే పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి ప్రవళిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో గోపాల్‌తో పాటు చిన్నారులు గాయపడగా వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వినోద్ పేర్కొన్నారు.

Next Story