- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిమ్స్ నియామకాల్లో డిప్లొమా అభ్యర్థులకు ఊరట
సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపట్టిన టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో డిప్లొమా అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది.

- జులై 13 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
- డిప్లొమా అభ్యర్థులకూ అవకాశం కల్పించాలని హైకోర్టు ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపట్టిన టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో డిప్లొమా అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్‌లో డిప్లొమా (డీఎంఐటీ) పూర్తి చేసిన అభ్యర్థుల దరఖాస్తులను కూడా స్వీకరించాలని నిమ్స్ అధికారులను ఆదేశిస్తూ.. జస్టిస్ కె.శరత్ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గడువు పొడిగింపు..
టిమ్స్‌లో వివిధ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నిమ్స్ జూన్ 22న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో కేవలం బీఎస్సీ (మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ) అర్హత ఉన్నవారికే అవకాశం కల్పించింది. దీనిని సవాలు చేస్తూ డీఎంఐటీ పూర్తి చేసిన ఎం.ప్రకాశ్ సహా పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం దరఖాస్తు గడువును జులై 13వ తేదీ వరకు పొడిగించింది. పిటిషనర్లను ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతించాలని స్పష్టం చేసిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వారి ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
వాదనలు ఇలా..
పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రభాకర్ చిక్కుడు వాదనలు వినిపిస్తూ.. "టిమ్స్ అనేది రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిపాలనలో ఉంటుంది. వైద్యారోగ్య శాఖ 2018లో జారీ చేసిన జీవో 65 ప్రకారం డిప్లొమా అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అర్హులే. నిబంధనలను మార్చే అధికారం నిమ్స్‌కు లేదు" అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిమ్స్, ప్రభుత్వ తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. టిమ్స్ ప్రస్తుతం నిమ్స్ పరిధిలో నడుస్తోందని, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా రిక్రూట్‌మెంట్ ప్రమాణాలను పెంచుకునే అధికారం నిమ్స్‌కు ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జీవో 65 వర్తించదని వాదిస్తూ, పూర్తి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, డిప్లొమా అభ్యర్థులను తాత్కాలికంగా ప్రక్రియలో చేర్చుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.






