బినామీలకు "ఏసీబీ "ఝలక్..

by Taduka Kalyani |

అవినీతి తిమింగలాలకు ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలోనే చరిత్ర లోనే మొదటి సారిగా బినామీ యాక్ట్ 1988 కేసును నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు.

బినామీలకు ఏసీబీ ఝలక్..
X

దిశ, సిటీక్రైం : అవినీతి తిమింగలాలకు ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలోనే చరిత్ర లోనే మొదటి సారిగా బినామీ యాక్ట్ 1988 కేసును నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. దీని కోసం ఇటీవల ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన కేసులలో డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్, జల మండలి అధికారి లక్ష్మణ్, ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే అధికారి నరహరి, ఆర్ అండ్ బి అధికారి మోహన్ నాయక్, పోలీసు ఉన్నతాధికారి భీమ్ రెడ్డి ల నుంచి బహిరంగ మార్కెట్ లో వందల కోట్లు విలువ చేసే ఆదాయానికి మించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. దర్యాప్తులో కొందరు అవినీతి అధికారులు బినామీ లను పెట్టుకుని అక్రమాస్తులను వారి పేరు మీద రిజిస్టర్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

బినామీ యాక్ట్ 1988 అమలు కు రంగం సిద్ధం —

దర్యాప్తులో వెలుగు చూసిన ప్రాథమిక ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు బినామీ యాక్ట్ 1988 కింద గుర్తించిన బినామీల పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయనున్నారు. దీని కోసం ఏసీబీ అధికారులు ఇన్ కమ్ టాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏసీబీ అధికారులు దర్యాప్తులో భాగంగా వెలుగు చూసిన బినామీల లెక్కలను ఇన్ కమ్ టాక్స్ అధికారులకు అందిస్తామని ఏసీబీ ఉన్నతాధికారి తెలిపారు.

7 యేండ్లు జైలు --

బినామీ యాక్ట్ 1988 సెక్షన్ 53(1)(2) అభియోగాలను ఇన్ కమ్ టాక్స్ అధికారులు దర్యాప్తు చేస్తారు. అభియోగాలు రుజువైతే ఈ యాక్ట్ కింద ఏడాది నుంచి 7 ఏండ్ల వరకు బినామీలకు జైలు శిక్ష పడుతుంది. అంతే కాకుండా ఆ ఆస్తులను ఇన్ కమ్ టాక్స్ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని విక్రయించి వచ్చిన నగదును ప్రభుత్వం కు అప్పజెబుతుంది. బినామీలను ప్రోత్సహించిన వారికి కూడా ఈ యాక్ట్ ప్రకారం శిక్షలు ఉంటాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఆ ఆస్తులు నావి కావు బినామీలు స్టేట్ మెంట్ --

ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కిన ఓ అవినీతి అధికారి తనకు తెలిసిన బంధువు పై గచ్చిబౌలి లో ఖరీదైన రెండు ఫ్లాట్ లను కొనుగోలు చేసాడు. ఏసీబీ అధికారులు దర్యాప్తులో భాగంగా ఆమెను విచారించినప్పుడు ఆ ఆస్తులు నావి కావు సంబంధిత అధికారివే నని నిజం చెప్పేసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రమ్మని చెప్పి సంతకాలు చేయమని చెప్పితే చేసానని చెప్పి ఆ అధికారిని బినామీ భాగోతాన్ని బయట పెట్టిందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.

Next Story