విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యాసంస్థల బంద్

by Ratna Kumari |

విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు మండల కేంద్రంతో పాటు చల్లసముద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు.

విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యాసంస్థల బంద్
X

దిశ, ఇల్లెందు : విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఇల్లెందు మండల కేంద్రంతో పాటు చల్లసముద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె. గణేష్, భారత విద్యార్థి సమాఖ్య జిల్లా నాయకుడు కిషోర్, జిల్లా నాయకుడు రణధీర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై హామీలు ఇస్తున్నప్పటికీ, విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని విమర్శించారు.

రాష్ట్రానికి ఇప్పటికీ పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే చర్యలు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను వెంటనే పునఃప్రారంభించాలని, అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక మండల విద్యాధికారుల స్థానంలో శాశ్వత అధికారులను నియమించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, బోధనేతర ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని కోరారు.

ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే చట్టాన్ని అమలు చేయాలని, విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని, ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రజా పాఠశాలను ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కిషోర్, హేమంత్, చందు, చరణ్, హిమశ్రీతో పాటు పలువురు విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story