తాడిచర్ల-2 కోసం తొలి ఉద్యమం ఎఐటియుసిదే

by Ratna Kumari |

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ తొలి ఉద్యమాన్ని ఎఐటియుసినే చేపట్టిందని ఆ సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు.

తాడిచర్ల-2 కోసం తొలి ఉద్యమం ఎఐటియుసిదే
X

దిశ, కొత్తగూడెం సింగరేణి : తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ తొలి ఉద్యమాన్ని ఎఐటియుసినే చేపట్టిందని ఆ సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం శేషగిరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2013లోనే తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కోసం సచివాలయాన్ని ముట్టడించి అరెస్టులకు గురైన ఘనత ఎఐటియుసిదేనని పేర్కొన్నారు. తాడిచర్ల-2తో పాటు మిగిలిన బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమ్మె నోటీసుపై ఈ నెల 15న రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో సింగరేణి యాజమాన్యం, ఎఐటియుసి ప్రతినిధుల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని తెలిపారు. ఆ చర్చలు ఫలించకపోతే ఆగస్టులో సమ్మెకు దిగడం ఖాయమని హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటాలో ప్రతి కార్మికుడికి 40 శాతం బోనస్ చెల్లించాలని, పెర్క్స్‌పై ఆదాయ పన్నును రద్దు చేయాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను వసూలు చేసి, కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన "బాయి బాట" కార్యక్రమంపై స్పందిస్తూ, అధికారంలో ఉన్న సమయంలో కార్మికుల సమస్యలను పరిష్కరించని బీఆర్‌ఎస్ ఇప్పుడు సానుభూతి వ్యక్తం చేయడం సమంజసం కాదని విమర్శించారు. ఈ సమావేశంలో ఎఐటియుసి నాయకులు కే.సారయ్య, వంగ వెంకట్, రమణమూర్తి, వీరస్వామి, క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story