చాదర్‌ఘాట్‌లో డెకరేషన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

by Taduka Kalyani |

నగరంలోని చాదర్‌ఘాట్‌లో మూసీ నది సమీపంలో ఉన్న డెకరేషన్ వస్తువుల గోదాంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

చాదర్‌ఘాట్‌లో డెకరేషన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ,చంపాపేట్ జూలై 10: నగరంలోని చాదర్‌ఘాట్‌లో మూసీ నది సమీపంలో ఉన్న డెకరేషన్ వస్తువుల గోదాంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే గోదాం అంతటా వ్యాపించి భారీ ఎత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. దట్టమైన నల్ల పొగ పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గోదాంలో ప్లాస్టిక్ వస్తువులు, థర్మాకోల్, అలంకరణ బట్టలు తదితర అత్యంత సులభంగా మంటలు అంటుకునే సామగ్రి పెద్ద ఎత్తున నిల్వ ఉండటంతో అగ్ని వేగంగా వ్యాపించింది. దీంతో గోదాంలోని డెకరేషన్ సామగ్రి అధిక భాగం మంటల్లో దగ్ధమైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అప్రమత్త చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. అయితే గోదాంలో నిల్వ ఉన్న విలువైన డెకరేషన్ సామగ్రి పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు. నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

Next Story